The Nybr
October 2026
Back to the city pulse
StoryOctober 2026

సృష్టికి కనుదృష్టి

——————————- గల గల పారే సెలయేరులు జల జల జారే జలపాతాలు అమృతతుల్యం ఆ జల నిధులు ఆరోగ్యానికి ఔషధ ధారలు అక్కరలేదు ఏ వడపోతలు దాహార్తిని తీర్చే దేవజనితాలు కానల నిండా వృక్ష రాజములు కళ…

Nallgandla · Hyderabad

——————————-
గల గల పారే సెలయేరులు
జల జల జారే జలపాతాలు
అమృతతుల్యం ఆ జల నిధులు
ఆరోగ్యానికి ఔషధ ధారలు
అక్కరలేదు ఏ వడపోతలు
దాహార్తిని తీర్చే దేవజనితాలు

కానల నిండా వృక్ష రాజములు
కళ కళలాడే హరిత పత్రములు
ఆమ్లజనికి సహజ ఆవాసాలు
రాజూ పేదకు సేద సౌధాలు
అక్కరలేదు ఏ పైకప్పులు
నీడ నిచ్చే నిష్పక్ష ఆశ్రయాలు

నిర్మలమైన గగన సీమలు
స్వేచ్ఛగా తిరిగే విహంగాలు
సమతుల్య సూర్య కిరణాలు
సకాలంలో వర్షపాతాలు
అక్కరలేదు మేఘమథనాలు
ప్రతి ఇంట పాడి పంటలు.

ఎటు చూసినా పచ్చని పైరులు
పైరులపై వీచే చల్లని గాలులు
మైమరిపించే మలయ వీచికలు
కాలుష్యమెరగని పవిత్ర గాలులు
అక్కరలేదు ఏ శిశిరోపచారులు
సురక్షితంగా ఇడా పింగళ నాడులు

పైన పేర్కొన్నవన్నీ ఓ శతాబ్దం క్రితం
మనిషి నిత్య తృప్తితో బతికిన రోజుల్లో
మనిషి ప్రకృతిని పూజించిన క్షణాల్లో
మానవాళికి ప్రకృతి ఇచ్చిన వరాలు

నూతన శతాబ్ద ప్రారంభం
ప్రకృతి నుదుటిన ప్రారబ్ధం
మనిషి మేధస్సు పెరిగింది
‘సృష్టికి కనుదృష్టి’తగిలింది
పుట్టుకొచ్చారు …..
ప్రకృతికి ప్రతిసృష్టి కర్తలు
ప్రారంభించారు…
పంచభూతాల ఆక్రమణలు

ప్రతి జీవుడులో కలి ప్రవేశం
ప్రతి వస్తువులో కల్తీ విశేషం
ప్రకృతి వరంగా ప్రసాదించిన
ప్రతీ అణువుకు వెల కట్టేశారు
ప్రతి అడుగు సామాన్య జనాన్ని
వెల వెలపోయేట్టు నిలబెట్టేశారు
ప్రకృతినిండా కాలుష్య కరాళ నృత్యం
ప్రతి మనిషిపై శిలీంధ్రాల దాడి నిత్యం

ఇలా ప్రశాంత ప్రకృతిని ప్రచండంగా
మార్చిన చండ ముండ కనుదృష్టికి
తీయాల్సిందే కలి కపాలంతో ‘దిష్టి’

రచన:
ఆర్. బాల గణపతి 
(ఆర్బీజీ) ✍️
హైదరాబాద్. 
ఫోన్ : +91 9573757254.

From The Nybr’s October 2026 edition, Hyderabad.

Keep discovering

More from Hyderabad.