పరుగు
(మినీ కథ) ఆయన ఓ ప్రభుత్వ ఉద్యోగి. ఆవిడ చదువుకున్న గృహిణి. ఇద్దరూ ఎవరి విధి నిర్వహణల్లో వారు రోజూ పెడుతున్నారు పరుగు. ఇద్దరు మగ పిల్లల తరువాత ఆడపిల్ల కోసం ఎన్నో గుళ్ళకు పరుగు…
(మినీ కథ)
ఆయన ఓ ప్రభుత్వ ఉద్యోగి.
ఆవిడ చదువుకున్న గృహిణి.
ఇద్దరూ ఎవరి విధి నిర్వహణల్లో
వారు రోజూ పెడుతున్నారు పరుగు.
ఇద్దరు మగ పిల్లల తరువాత
ఆడపిల్ల కోసం ఎన్నో గుళ్ళకు పరుగు.
మొక్కుబడులు ఫలించి వారి అన్యోన్య దాంపత్యానికి చిహ్నంగా గర్భవతి
అయిన శ్రీమతిని పట్టుకొని
ప్రతీ నెలా వైద్యుడి దగ్గరికి పరుగు.
నెలలు నిండి ప్రసూతి గదిలో ఆవిడ…
బయట వరండాలో పరుగులాంటి అడుగులతో పచార్లు చేస్తూ ఆయన…
మళ్లీ కొడుకే అన్న వార్తతో
ఓ క్షణమే ఆగింది ఆయన పరుగు.
ముగ్గురు పిల్లలను పెంచటంలో
ఆగలేదు ఏనాడు వారిద్దరి పరుగు…
ఆయనకు ఉద్యోగ బాధ్యతల పరుగు
ఆమెకు సంసార బాధ్యతల పరుగు
పిల్లల్ని ప్రయోజకులను చేయటంలో
వారి చదువుల కోసం పరుగు
వారి ఉద్యోగాల కోసం పరుగు
వారి విదేశీ పయనం కోసం పరుగు
వారి పెళ్లిళ్ల కోసం పరుగు
వారి పిల్లల కోసం పరుగు
ఈ పరుగులో నిర్లక్ష్యం చేసిన
తన,తన భార్య ఆరోగ్యం గురించి
ప్రతీ వైద్యుని దగ్గరికి పరుగు
ఈ పరుగు పందెంలో గెలవాలనే పట్టుదలతో భార్య కన్నా ముందు
ఓ అడుగు ముందుకు వేసి ఆయన
పరుగున ఐసియు లోకి ప్రవేశం.
ఐసియు బయట ఉన్న భార్య
కళ్ళనీళ్ల పర్యంతమై భారంగా
కొడుకులకు ఫోన్ చేసి పరుగున
రమ్మంది ఆయన ఆఖరి చూపుకి.
కానీ వాళ్ళు క్షణ క్షణం ఉద్యోగ రక్షణ పరుగు పందెంలో పరుగున రాలేనంత దూరంలో స్థిరపడి పోయారు.
పిల్లల రాక కోసం ఎదురుచూస్తూ
“ఈయన పరుగు ఇక్కడితో సరా?”
అని ఆవిడ అనుకుంటూండగా…
ఆయన ఆత్మస్థైర్యంతో పోరాడలేక యమభటులు పెట్టారు పరుగు.
వెంటనే ఐసియులోంచి బయటికి
పరుగున వచ్చి “మీ ఆయన సేఫ్”
అని చెప్పారు ఆనందంగా డాక్టర్లు.
అంతే పరుగున ఆయన దగ్గరికి వెళ్లి
ఆవిడ “మన పిల్లలూ ..” అంటూ ఏదో
చెప్పబోయేసరికి….
“వాళ్ల పరుగు పందెంలో వాళ్ళు ఉన్నారు, అంతేగా.. అలాగే కానీ”అంటూ…ఆవిడ చేతిని గట్టిగా పట్టుకుని
“మన జీవితం మనది…వాళ్ల జీవితాలు వాళ్ళవి. ఎవరి కోసం ఎవరూ పరుగు పెట్టలేని పరిస్థితుల్లో అందరి జీవితాలు. అయినా పరవాలేదు. మనం చతికల పడాల్సిన పని లేదు. ఇప్పుడింక మన కోసం మళ్లీ మొదలెడదాం మెరుగైన మన పరుగు…కానీ ఈ సారి కొంచం నెమ్మదిగా”అని బయట ప్రపంచంలోకి అడుగు పెట్టాడు.
ఆయన “న్యాయశాస్త్రం” లో చేరితే
ఆవిడ “మనస్తత్వ శాస్త్రం”లో చేరింది.
ఇద్దరూ రోజూ పరుగులు పెట్టకుండా
వారమంతా ప్రశాంతంగా కాలేజ్ కి,
వారాంతంలో అనాధాశ్రమంలో పిల్లలతో హాయిగా చక్కగా గడపటం
నెమ్మది నెమ్మదిగా అలవాటు చేసుకున్నారు. ఆఖరి క్షణం వరకు విజ్ఞానాన్ని పంచిపెట్టిన శ్రీ అబ్దుల్ కలాం గారి స్ఫూర్తితో,వారిద్దరు కూడా పేద పిల్లలకు విద్యను,తోచినంత ధనాన్ని సాయం చేస్తూ అపరిమిత ఆనందం పొందటం మొదలు పెట్టారు.
మధ్య మధ్యలో పిల్లలతో,మనవలతో
వీడియో కాల్స్ చేస్తూ ఆనందంగా
ఏ ఉరుకులు, పరుగులు లేకుండా వారి జీవిత మలి సంధ్యలో ప్రతీ రోజు బాల్కనీ లో కూర్చోని ఉదయించే తొలి సంధ్య సూర్యుని చూస్తూ స్ట్రాంగ్ ఫిల్టర్ కాఫీ తాగుతూ జీవితాన్ని ప్రతీ క్షణం ఆస్వాదిస్తూ, చివరి క్షణం వరకూ హాయిగా సాగించారు వారి జీవితం.
జీవితంలో పరుగు అవసరమే
కానీ ఎంత పరిగెత్తాలి,ఎప్పడు ఆపాలి
తెలుసుకున్నవాళ్లు….
ఆవిడ,ఆయన లాగా హాయిగా వుంటారు.
అన్నట్టు వాళ్ళిద్దరి పేర్లు మనం చెప్పుకోలేదు కదా!
అయినా… వాళ్ల పేర్లు ఎందుకులెండి?
ఈ కథ ఆధునిక పరుగుల యుగంలో
మనందరి కథ…ప్రతీ తల్లి తండ్రుల కథ.
ఆర్బీజీ ✍️
ఆర్. బాల గణపతి
హైదరాబాద్.
ఫోన్ : +91 9573757254.
From The Nybr’s October 2026 edition, Hyderabad.
Keep discovering
More from Hyderabad.

